23న వైఎస్సార్‌సీపీ యువత పోరు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడచినా హామీల అమలులో ఘోర వైఫల్యంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని, సూపర్–6 హామీల్లో నిరుద్యోగ భృతి ని అమలు చేయలేదని.. నిరుద్యోగ యువత, విద్యా ర్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టినట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈనెల 23న చేపట్టనున్న వైఎస్సార్‌సీపీ యువత పోరు పోస్టర్లను ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వీటిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వీటిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈనెల 23న ఏలూరులో వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుంటామని, అక్కడ దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం శాంతియుత ర్యాలీ చేపడతామన్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరువుతారని చెప్పారు.
Leave A Comment