ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
అమరావతి: రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతోపాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చి దిద్దాలని సూచించారు. ఏరోస్పేస్, అండ్ డిఫెన్స్ సలహాదారు సతీశ్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.
Leave A Comment