------------------------కాలేజ్ డి ఫ్రాన్స్ భాషా శాస్త్రవేత్త, ప్రొఫెసర్, భారత ఉపఖండంలోని వివిధ అంశాలపట్ల సాధికారత కలిగిన యూజీన్ బర్నౌఫ్ (1801-1852) రాసిన విషయమిది.
ఆయన ఇలా వ్రాశారు... "తెలింగాలు, వెల్లజెర్, పల్లి తెగలవారు (Telingas, Vellajer and Palli)
కొరియర్లు, ఉత్తరాలను తీసుకెళ్లే హక్కును కలిగి ఉండేవారు. పోర్టర్లు తాము పంపిణీ చేయవలసిన వాటిని ఒక చిన్న టిన్ ప్లేట్ లేదా కలప పెట్టెలో ఉంచేవారు. ఆ పెట్టెను వారు తమ తలలపై పెట్టుకుంటారు. వారు నిరంతరం పరిగెత్తుతూ ఉండేవారు. వారికి పన్నెండు గంటల్లో ముప్పై మైళ్లు ప్రయాణించగల శక్తి ఉండేది. ఇసుక నేల, నదుల మార్గం, వాతావరణ వేడి, ఇలా ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించి తమ కర్తవ్యాన్ని నెరవేర్చే వారు. కనుక వారి వేగాన్ని అందరూ కొనియాడేవారు. కథలు కథలుగా చెప్పుకునేవారు.
ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఉంది.
మార్గమధ్యంలో పాములు ఎదురైతే వారు వాటిని తరిమికొట్టడానికి తమ ఎడమ భుజంపై చివర ఉంగరం ఉన్న కర్రను ఉంచుకునే వారు. పాము కనిపించగానే నేలమీద ఆ కర్రతో కొట్టే వారు.
మరొక భుజంపై చెమటను తుడుచుకోవడానికి ఉపయోగించే ఓ తడి గుడ్డ ఉండేది.
కొరియర్‌లను తపాలర్ అని పిలిచే వారు. దీని మూలం తపాల్ అనే పదం. పోస్టులను ఇవ్వడాన్ని సూచించే మాట.
బర్నౌఫ్, యూజీన్ ఇరానియన్ భాషాశాస్త్రం, అలాగే బౌద్ధమత చరిత్ర అధ్యయనానికి స్థాపకుడు. ఫ్రాన్సులో బౌద్ధమతం గురించి విస్తారంగా ప్రచారం చేసిన ఈయన పారిస్‌లో ఓ హెలెనిస్ట్ కుమారుడిగా జన్మించారు. సంస్కృతాన్ని అభ్యసించారు. 1829లో ఆయన ఎకోల్ నార్మల్ సుపీరియర్‌లో తులనాత్మక వ్యాకరణాన్ని బోధించారు. 1832లో కాలేజ్ డి ఫ్రాన్స్‌లో చేరారు. ఆయన సంస్కృతం బోధిస్తూనే మరోవైపు జీవితాంతం భారతీయ, ఇరానియన్ అధ్యయనాలను కొనసాగించారు.
ఇరానియన్ భాషాశాస్త్ర రంగానికి సంబంధించి బర్నౌఫ్ రచనలలో, అతని అతి ముఖ్యమైన ప్రచురణ కామెంటైర్ సుర్ లే యాక్నా (1833). ఇందులో ఆయన అవెస్తాన్‌ను అర్థం చేసుకోవడానికి, మొత్తం ఇరానియన్ భాషాశాస్త్రానికి ఆధారాన్ని వివరించారు. ఇది ఆయన అధ్యయనాల్లో ముఖ్యమైనది. అప్పుడు ఆయన వద్ద ఉన్న పత్రాలలో అవెస్తాకు సంబంధించి నాలుగు మాన్యుస్క్రిప్ట్‌లు వంటివి ఉండేవి. విభిన్న అనువాదాలను పరిశోధించడం, అవెస్తాన్ వచనాన్ని అర్థం చేసుకోవడం బర్నౌఫ్ ప్రధాన లక్ష్యం. అన్నింటికంటే ముఖ్యంగా సంస్కృతం, పెర్షియన్ తులనాత్మక వ్యాకరణంపై విశేష కృషి చేశారు. వేదాలపైన అధ్యయనం చేసిన ఆయన ఇండో - యూరోపియన్ భాషలపట్ల అనేక పరిశోధనలు చేయడం గమనార్హం. అంతర్ దృష్టితో ప్రేరేపించిన ఆయన అవెస్తాన్ వివిధ వయసుల రూపాల మిశ్రమం" అని ప్రకటించారు. ఆయన ఓ నిఘంటువును కూడా రూపొందించారు.
బర్నౌఫ్ అవెస్తాన్ వర్ణమాలను అందించడంలో విజయం సాధించారు. యస్నా ప్రారంభ భాగంలో పదజాలంలో ఎక్కువ భాగాన్ని విశదీకరించారు. అవెస్తాన్ రచనా క్రమంలో అనేక వ్యాకరణ రూపాలను, అలాగే కొన్ని సంకోచ రూపాలను వివరించారు. ఈ ప్రక్రియలో ఆయన తులనాత్మక వ్యాకరణంలో పాత ఇరానియన్ స్థానాన్ని స్థాపించారు. ఆయన వేద పండితుల రచనలపై, ముఖ్యంగా రాస్మస్ రాస్క్ (1826) మరియు ఫ్రాంజ్ బాప్ (1816) పై ఎక్కువగా ఆధారపడ్డారు.
బర్నౌఫ్ పాత పర్షియన్ అధ్యయనానికి ముఖ్యమైన కృషి చేశారు. ఇది అవెస్తాన్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉందని ఆయన గ్రహించారు.
బర్నౌఫ్ లేఖలు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఆయన హృదయపూర్వక, విశ్వాసపాత్రమైన, అత్యంత నిరాడంబరమైన, హాస్య భావనతో కూడిన వ్యక్తి. ఆయన ఆరోగ్యం ఎప్పుడూ సామాన్యంగానే ఉండేది. ఆయన అకాడమీ డెస్ ఇన్‌స్క్రిప్షన్స్ ఎట్ బెల్లెస్-లెట్రెస్‌కు శాశ్వత కార్యదర్శిగా ఎన్నికైన కొంత కాలానికే చిన్న వయస్సులోనే మరణించడం విచారకరం.
- యామిజాల జగదీశ్
Leave A Comment