------------------
ఒకరిని భోజనానికి పిల్చినప్పుడు వారికి చక్కటి వంట పదార్థాలు చేసి పెట్టడం ఎంత ముఖ్యమో అలాగే వాటిని వడ్డించడానికీ ఓ తీరుంది. అది చక్కడా ఉండాలంటాడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఏదో ఒకటి తయారు చేసి కడుపు నిండా పెట్టామనుకోవడం కన్నా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా పెట్టామన్నది ప్రధానం. తల్లులకైతే తమ పిల్లలతో ఎలా తినిపించాలో బాగా తెలుసు. వారికి తెలిసినంతగా నాన్నలకు అంతగా తెలీదు.
కాశీఖండంలో శ్రీనాధుడు ఓ చోట వడ్డన తీరుని చక్కగా వర్ణించాడు. అది ఎప్పటికీ అనుసరణీయమే. పెద్దలకు అన్నం పెట్టడంలోనూ సాధువులకు భిక్ష వేయడంలోనూ ఆ పద్ధతి పాటించడం వల్ల పెట్టేమనసుకెంత తృప్తి కలుగుతుందో వేరేగా చెప్పక్కర్లేదు.
“ముంగిట గోమయంబున గోముఖము దీర్చి ....గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి నన్నపూర్ణభవాని కట్టనుగు జెలులు” అనే సీసపద్యంలో ఇలా అంటాడు శ్రీనాథుడు...
తొలుత ఆవుపేడతో అలకాలి. నాలుగు వైపుల ముగ్గుకర్ర పెట్టాలి. ముగ్గు కర్ర అంటే తిన్నగా సరళ రేఖలు గీయాలి. అవి ఏం చెప్తాయంటే ఈ ప్రాంతానికి ఇదే సరిహద్దు అని తెలియజెప్తాయి. అనంతరం వచ్చిన అతిథిని అక్కడ నిల్చోమని చెప్పాలి. అర్ఘ్యం, పాద్యం, పువ్వులు, గంధం వంటి షోడశోపచారాలతో పూజించాలి. ఆ తర్వాత బంగారు గరిటతో అన్నం మీద నెయ్యి పోయాలి. వండిన పదార్థాలను భక్తితో విశ్వాసంతో తృప్తిగా వడ్డించాలి. దీన్నే మాధుకర భిక్ష ఇచ్చే పద్ధతి అంటారు.
ఇక ఇదంతా అయిన తర్వాత అతిథులకు భోజనం పెట్టే సమయంలో వారి పంక్తి మధ్యలోకి ఇంటి యజమాని వచ్చి అన్నం వడ్డించాలి.
ఇలా ఉండగా, వడ్డించిన విస్తరిలో ఉన్న పదార్థాలను తమ నిత్యార్చన మూర్తికి నివేదించి మరీ భుజిస్తారట ఆస్తికులు అని శ్రీనాథుడు హరవిలాసం అనే తన కావ్యంలో చెప్పాడు.
అతిథులకు భోజన సమయంలో ప్రశాంతంగా భుజించటానికి వట్టివేళ్ళ విసనక్రరతో వీచాలట. ఈ మర్యాదను దమయంతి పెండ్లి రోజు అనే ఘట్టంలో వర్ణించాడు శ్రీనాథుడు.
అసలు వడ్డించడం అనేదొక కళ. దానికెంతో నేర్పరితనం అవసరం. వడ్డించే పదార్థాలతో పాటు అభిమానాన్ని కూడా రంగరించాలి. ఏదో ఒకటి పెట్టడం కాదు, ఎంత తృప్తిగా పెట్టామన్నది ముఖ్యం.
ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి. భోజన కార్యక్రమం ఆనందంగా ఆహ్లాదంగా సాగాలంటే పెట్టే వారే కాదు, తినే వారు కూడా అలాగే నడచుకోవాలి. ఆబగా తినడమో రుసరుసలాడుతూ తినడమో చేయకూడదు. అది సరైన పద్ధతి కాదు. తింటున్నప్పుడు రుచుల గురించి చెప్పకూడదట. ఎందుకంటే అధికశాతం మందికి రుచులు చెప్పడం సరిగ్గా తెలీదు. తనకు సరిగ్గా లేదనుకున్న రుచి మరొకరికి బాగుండొచ్చు. కనుక తను తిననంత మాత్రాన అదో ఒకటి చెప్పి తినాలనుకున్న వారితోనూ తిననివ్వకుండా చేయడం భావ్యం కాదంటాడు శ్రీనాథుడు.
- యామిజాల జగదీశ్
Leave A Comment