ఆయన పొలం
పక్షుల శరణాలయం !
----------------------------
సొంత భూమిలో పక్షుల శరణాలయాన్ని ఏర్పాటు చేసిన కోయంబత్తూరు సేంద్రియ రైతు కథనమిది. కోయంబత్తూరుకు చెందిన రైతు ముత్తుమురుగన్ తన అర ఎకరం భూమిలో పక్షి దాణా కోసం మొక్కజొన్న, వరి సాగు చేస్తున్నారు.
చాలా మంది రైతులకు పక్షులు ఇబ్బందిగా కనిపిస్తుంటాయి. అయితే కోయంబత్తూరుకు చెందిన ఓ ఆర్గానిక్ రైతుకు పక్షులు ప్రాణ స్నేహితులు. ఆయనే ముత్తు మురుగన్. ఆయన వయసు 67 ఏళ్లు.
కోయంబత్తూరులోని తొండముత్తూరు గ్రామంలో ఆయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో ఓ అర ఎకరం పొలంలో పక్షులు తినేందుకు ప్రత్యేకంగా మొక్కజొన్న, వరి సాగు చేస్తున్నారు. ఆహారం అడవుల్లో పండినట్లు ప్రకృతికి అనుగుణంగా పండాలన్నది ఆయన అభిమతం.
అడవిలో ఎవరూ పురుగుమందులు వాడరు. అడవులను తమ ఆవాసాలుగా చేసుకునే పక్షులను ఎవరూ అడ్డుకోవడం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి? రసాయనాలతో కీటకాలను చంపడం వల్ల పక్షులకు ఆహారం కూడా అందకుండా పోతున్నాదని ముత్తు మురుగన్ అన్నారు.
పర్యావరణవేత్త, సేంద్రీయ రైతు అయిన ముత్తు మురుగన్ కి పక్షులంటే వల్లమాలిన ప్రేమ.
మూడు నాలుగేళ్ళ క్రితం ఆయన తన భూమిలో పావు ఎకరం భూమిలో మొక్కజొన్న, వరి పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన విత్తనాలు చల్లడానికి వెళ్ళినప్పుడు, పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. అప్పుడు ఆయనకెంతో ఆనందమేసింది.
“ఈ భూమి పక్షి గూడు లాంటిది. వాటిని వెంటబడి తరమకూడదు. ప్రతి సంవత్సరం నా పంటలో కొంత భాగాన్ని పక్షులకు తినడానికి వీలుగా మొక్కజొన్న, వరి సాగు చేస్తాను" అని అనుకున్నారు.
ఓ సంవత్సరం ప్రభుత్వాధికారులు కొన్ని ఆంక్షలు విధించినప్పుడు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుందని భావించిన ఆయన పంటలు సాగు చేయలేదు. పక్షులకు ధాన్యాలు, ఆవులకు అవసరమైన మేత మాత్రమే పండించారు.
చాలా మంది రైతులు లాభాల కోసం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ప్రారంభించారు. దీంతో గ్రామానికి వచ్చే పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
పక్షులను తరిమికొట్టేందుకు కొందరు రైతులు వాటిపై రాళ్లు రువ్వుతుంటే ఆయన మనసు తెగ బాధపడింది. వాళ్ళనేమీ అనలేని స్థితిలో తన వరకైనా వాటి సంరక్షణకు ఏదన్నా చేయాలనుకుని దానికి పరిష్కారంగా పక్షులను పెంచేందుకు ముత్తు 3 వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం, చిలుకలు, కోళ్లు, నెమళ్లు, వడ్రంగిపిట్టలు, కింగ్‌ఫిషర్లు, మచ్చల గుడ్లగూబలు, పిచ్చుకలు, మైనాలు, పావురాలు, పిచ్చుకలు, కుందేళ్లు, పురుగులు, నత్తలు, బీటిల్స్, గొల్లభామలు, తేనెటీగలు ఆయన భూమిలో నివసిస్తున్నాయి.
ముత్తు మురుగన్ తన స్ధలంలో పక్షులు స్వేచ్చగా తిరిగేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించడంతో ఈ ప్రాంతం పక్షుల అభయారణ్యంలా మారింది.
అయితే పక్షులను నిశితంగా పరిశీలించగా, వాటికి సరిపడా ఆహారం అందడం లేదని గ్రహించారు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలను వెతుక్కుంటూ వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయం. ఈ కారణంగానే ఈ సేంద్రియ రైతు వరి, మొక్కజొన్న సాగు చేయడం మొదలుపెట్టారు..
“నా నాలుగు ఎకరాల భూమి అనేక పక్షులకు నిలయం. ప్రతి ఒక్కరూ జీవుల పట్ల శ్రద్ధ వహిస్తే ప్రపంచం ఎం త అందంగా మారిపోతుందో కదా...ఒక్కమారలా ఊహించండి. అందువల్ల ప్రతి ఒక్కరూ జీవుల పట్ల కనికరం చూపితే బాగుంటుంది” అని ఆయన చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రవేశపెట్టడం వల్ల పక్షులు అంతరించిపోతున్నాయి. దీంతో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అంటున్నారు. ‘
‘అడవులు తరుగుదలకు మనమే కారణం. గ్లోబల్ వార్మింగ్‌లో కర్బన ఉద్గారాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెట్రోలు, డీజిల్ వాడకమే ఇందుకు కారణం. ట్రాక్టర్ వచ్చాక దున్నేందుకు ఆవులను ఉపయోగించడం మరిచిపోయాం. ఆ విధంగా అవి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరించే ప్రయత్నాలు చేపట్టాను' అని ముత్తు మురుగన్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, “ఒకప్పుడు ఈ ప్రాంతంలో దేశవాళీ ఆవులు ఉండేవి కావు. ప్రస్తుతం ఇక్కడ 50-60 ఆవులు ఉన్నాయి. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఇదే ఆధారమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆవు ఉంటే దాని పేడను ఉపయోగించుకోవచ్చు. ఇందులో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. అవి విస్తరిస్తాయి. వాటిని తినడానికి పక్షులు వస్తాయి. ఈ పక్షులు అనేక చెట్ల విత్తనాలను తెస్తాయి. కాబట్టి పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉంటేనే పర్యావరణం బాగుంటుంది’’ అని అన్నారు.
ఆయనను చూస్తే పక్షులు, ఇతర జంతువులు భయపడవు. అవి తమ సంరక్షణ కేంద్రంగా అనుకుని యథేచ్ఛగా గడుపుతాయి. వాటి కదలికలు చూడటానికి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేనంటారాయన. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కిచెప్పడానికే తాను వాటికి రక్షణ కల్పిస్తున్నానని చెప్పారు.
“ప్రతిదీ మనకోసం తయారు చేయబడిం దని మనం భావిస్తుంటాం. అయితే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది’’ అని ముత్తు మురుగన్ అన్నారు.
- యామిజాల జగదీశ్
Leave A Comment