• Login / Register
  • Site Logo

    పుస్తకం చదివితే హెయిర్ కట్టింగులో రాయితీ

    హోమ్
    గ్రంథాలయమైన క్షౌరశాల
    -----------------------------------
    పుస్తకం చదివితే హెయిర్ కట్టింగులో  రాయితీ...ఈ ప్రకటన అక్కడి క్షౌరశాలకు వచ్చే వారిని తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ ప్రకటన చేసినతను తమిళనాడులోని తూత్తుక్కుడికి చెందిన ఓ యజమాని!

    ప్రజలు రద్దీగా కనిపించే బస్టాండు, రైల్వే స్టేషన్లు మొదలుకుని ఇక్కడా అక్కడా అని కాకుండా అన్ని చోట్లా అందరి చేతుల్లోనూ కనిపించేది సెల్ఫోన్. ఒక్కొక్కరి దగ్గరైతే రెండు మూడు సెల్ఫోన్లు. ఒకదాంట్లో మాట్లాడుతుంటాడు. మరొక ఫోన్లో ఏదో చూస్తుంటాడు. ఈ రెండూ కాకుండా మరొకటి జేబులో ఉంటుంది. ఇలా ఈ సెల్ఫోన్ల యుగంలో ఇరవై నాలుగ్గంటలు అనేది సరిపోవడం లేదు. అందరం బిజీగానే ఉంటాం.

    పూర్వం క్షౌరశాలలో వినియోగదారులు జుత్తు కత్తిరించుకోవడానికి వెళ్ళేవారికోసం అక్కడ ఉన్న రేడియో, దినపత్రికలు వంటివి ఉండేవి. తమ వంతుకోసం నిరీక్షించేవారు పత్రికలు తిరగేసేవారు. లేదా రేడియో  వినేవారు. కొన్ని షాపుల్లో అయితే టీవీలు లేకపోలేదు వీక్షించడానికి. కానీ ఇప్పుడు అందరి దగ్గరా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్నాయి. వాటితో కాలక్షేపం చేస్తుంటారు. 

    కొన్ని క్షౌరశాలలను చూస్తే అవి హెయిర్ కట్టింగ్ దుకాణాలేనా అనే అనుమానమొస్తుంది. అక్కడి సెటప్  ఆలోచనలో పడేస్తుంది. 

    కానీ తూత్తుక్కుడిలోని ఆ హెయిర్ కట్టింగ్ సెలూన్ ఒకింత భిన్నమైనది. అక్కడ క్రాఫ్ చేయించుకోవడానికి వెళ్ళే వారిని ఓ ప్రకటన ఆశ్చర్యపరచకమానదు. తూత్తుక్కుడిలో మిల్లర్ పురంలో ఉందీ ఈ క్షౌరశాల. ఈ దుకాణం యజమాని పేరు పొన్ మారియప్పన్. ఈ దుకాణం పేరు సుశీల్ కుమార్ బ్యూటీ కేర్. పుస్తకాలు చదివేవారికి హెయిర్ కటింగుకి వసూలు చేసే ఛార్జీలో రాయితీ ఉంటుందప్నదే ఆ ప్రకటన.
     
    తన దుకాణానికి వచ్చే వినియోగదారులు నిరీక్షించే కాస్సేపట్లో ఏదో ఒకటి చదివి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ళ క్రితం తన దుకాణంలో కొన్ని పుస్తకాలు కొని ఉంచాడు.

    ఈరోజు ఆ దుకాణం ఓ చిన్నపాటి లైబ్రరీలా మారింది.

    దీని గురించి పొన్ మారియప్పన్ మాట్లాడుతూ సెల్ఫోన్ల రాకతో పుస్తకాలు చదవడమనేది పూర్తిగా తగ్గిపోయింది. ఏది కావాలన్నా సెల్ఫోన్లో చూసుకోవడమే. పక్కన మనుషులు ఉన్నారా లేదా అనేది కూడా పట్టక సెల్ఫోన్లో కూరుకుపోతున్న వారిని చూస్తుంటే మనసు బరువెక్కుతోం
    ది. మారుతున్న కాలంతోపాటు మనమూ మారాలి. కాదనను. కానీ కొన్ని మంచి అలవాట్లను మరచిపోతే ఎలా? అటువంటి అలవాట్లలో ఒకటైన పుస్తకపఠనాన్ని పెంపొందించడంకోసమే నేను నా దుకాణంలో పుస్తకాలు కొని పెట్టాను. ఇందువల్ల నేను నా దగ్గరకు వచ్చే వారందరినీ మార్గలనో లేదో చెప్పలేను కానీ కొందరిలోనైనా పుస్తకాలు చదవాలనే ఆసక్తి పెంపొందించాలనేదే నా ఆశ. ఆశయం. ఇది ఒక కొత్త ప్రయోగమే అని అనుకుంటున్నాను. అందుకోసమే పుస్తకాలు కొని ఉంచాను అన్నారు. ఇంతకూ పొన్ మారియప్పన్ చదువుకున్నది ఎనిమిదో తరగతి వరకే. 

    తొమ్మిదేళ్ళ సంవత్సరాల క్రితం ఈ దుకాణం ప్రారంభించినప్పుడు మిగతా అన్ని దుకాణాలలోలాగా నా దుకాణంలోనూ ఓ టీవీ ఒకటి రెండు పత్రికలు ఉండేవి. కానీ ఆ పత్రికలను చదవడం లేదు. టీవీని చూడటం లేదు. అందరూ సెల్ఫోన్లో మునిగిపోతున్నారని గమనించాను. ఈ పద్ధతిని మార్చాలనిపించింది. ఎలా మార్పు తీసుకురావాలాని ఆలోచించాను. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతియార్ చెప్పిన పుస్తకాలే నా ఆస్తి...వీటినే నా పిల్లలకు ఇస్తున్న ఆస్తి అనే అక్షరలక్షల మాటలు గుర్తుకొచ్చాయి. అంతే మరుక్షణం నేను నా దుకాణంలో పుస్తకాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టానన్నారు పొన్ మారియప్పన్ 

    మొదట్లో అయిదారు పుస్తకాలు మాత్రమే ఉండేవి. వాటిని తన దగ్గరకొచ్చే వినియోగదారుల దృష్టిని  ఆకట్టుకుంటోందో లేదోనని గమనించాను. వచ్చిన వారిలో కొందరు చదవడం చూసి రెండు వందల యాభై పుస్తకాలు కొని ఉంచానన్నారాయన.
    చరిత్ర, సాహిత్యం, కథానికలు, కవితలు ఇలా రకరకాల పుస్తకాలు కొని ఉంచారు.
    వినియోగదారులలో ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడం కోసం ప్రస్తుతం ఈ హెయిర్ కటింగ్ సెలూన్ లో దాదాపు పదిహేను వందల పుస్తకాలున్నాయి. అందుకే ఇక్కడికొచ్చే వారందరూ దీనిని ఓ లైబ్రరీగానూ చెప్తుంటారు. పైగా అంతటితో ఆగలేదు మారియప్పన్. అక్కడో నోట్ బుక్ ఉంచారు. వినియోగదారుడు తాను చదివిన పుస్తకంలోంచి తనకు నచ్చిన మాటలను, పుస్తకం పేరునీ, చదివిన పుస్తకంలో ఎన్నో పేజీలో ఉందో తెలిపే నెంబరుని రాసి సంతకం చేయాలి. అలా నోట్ బుక్కులో రాసిన వారి పేర్లను చిన్న చిన్న కాగితాల మీద విడివిడిగా రాసి లక్కీ డ్రా తీస్తారు. అందులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి పుస్తకాలను కానుకగా ఇస్తుంటారు పొన. మారియప్పన్. ఈ లాటరీ విధానాన్ని ముఖ్యంగా విద్యార్థుల విషయంలో పాటిస్తున్నానన్నారు.

    ఇలావుండగా ప్రధాని నరేంద్రమోదీ దృష్టిలో పడిన ఈ బ్యూటీ కేర్ విషయం తన మన్ కీ బాత్ ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఓరోజు పొన్ మారియప్పన్ తో మాట్లాడి అభినందించడం గమనార్హం. ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారమవడానికి రెండు రోజుల క్రితం మారియప్పన్ ని స్థానిక ఆలిండియా రేడియో కేంద్రంవారు పిలిపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది మారియప్పన్ కి. ప్రధాని తనతో మాట్లాడుతారని. కార్యక్రమం రోజున సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పొన్ మారియప్పన్ కృషిని ప్రధాని అభినందించి ప్రోత్సహించారు. ప్రధాని తన పేరు పలుకుతుంటే ఆశ్చర్యపోయానని మారియప్పన్ చెప్పారు. తమిళంలో ఒకటి రెండు మాటలు మాట్లాడిన ప్రధాని తన తమిళ ఉచ్చారణ ఎలా ఉందో చెప్పమన్నారు. ఇంతకూ తన కేర్ సెంటర్లో ఇలా పుస్తకాలు ఏర్పాటు చేయిలనే ఆలోచన ఎలా వచ్చిందోనని ప్రధాని ఆయనను అడిగి తెలుసుకున్నారు. అప్పుడు మారియప్పన్ మాట్లాడుతూ తాను ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నానని, అంతకుమించి చదువుకునే అవకాశం లేకపోయిందని, తన దుకాణానికి చదువుకున్న వాళ్ళు అనేకమంది వస్తుంటారని, కనుక నేనూ చదువుకోవాలని కోరిక పుట్టిందని చెప్పారు.తాను చదివి ఇతరులతోనూ చదివింపచేయాలనే తలంపుతో సొంతంగా ఈ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు పొన్ మారియప్పన్ తెలిపారు. ఏ పుస్తకం ఎక్కువ ఇష్టమని ప్రధాని అడగగా తిరుక్కురళ్ ఇష్టమని పొన్ మారియప్పన్ జవాబిచ్చారు. తిరుక్కురళ్ అనేది తమిళులకు దక్షిణ వేదంలాంటిది. దీనిని వల్లువర్ రెండు వేల సంవత్సరాల క్రితం రాశారు. ఇలా ప్రధాని ఓ మూడు ప్రశ్నలు వేయడం, వాటికి తాను జవాబులు చెప్పడం తన జీవితంలో మరచిపోలేని ఓ గొప్ప అనుభూతి అని పొన్ మారియప్పన్ చెప్పారు.

    ఈ బ్యూటీ కేరుని 2014లో ప్రారంభించడానికి ముందర పొన్ మారియప్పన్ ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. ఓ ఏడాది తర్వాత ఆంటే 2015లో ఆయన తన దుకాణంలో పుస్తకాలు కొని పెట్టడం మొదలుపెట్టారు. పుస్తకాలకోసం ఆయన విడిగా కొన్ని షెల్ఫులు తయారు చేయించారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వారిని బాగా చదివించాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ముగ్గురు పిల్లలూ ఇంగ్లీష్ మీడియం స్కూల్సులో చదువుతున్నారు. ఈ దుకాణంలో పుస్తకాలతోపాటు ఓ ఎంపి3 MP3 ప్లేయర్ కూడా ఉంది. దీనిద్వారా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను విన్పిస్తుంటారు. ఈయన విషయం తెలుసుకున్న కుని చెన్నై లైబ్రరీ డైరెక్టర్ ఓ యిభై పుస్తకాలు పొన్ మారియప్పన్ కి ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ రెండే కుర్చీలుంటాయి. ఆయన ఒక్కరే హెయిర్ కట్ చేస్తారు. దుకాణంలో మిగిలిన చోటంతా పుస్తకాలే కనిపిస్తాయి. ఎటు చూసినా పుస్తకాలే కనిపిస్తాయని ఆయన గర్వంగా చెప్పుకుంటారు. రోజుకి 25 నుంచి 50 మంది కస్టమర్లు వస్తుంటారు. యువకుల్లో ఎక్కువ మంది ట్రిమ్ చేయించుకుంటారు. వినియోగదారులు తన షాపులోనే పుస్తకాలు చదవాలని, ఇళ్ళకు తీసుకుపోయే వీలులేదన్నారు మారియప్పన్. 

    ఇలావుండగా సి. ధనపాల్ అనే వినియోగదారుడు మాట్లాడుతూ తాను నాలుగేళ్ళుగా ఇక్కడికి వస్తున్నానని, తాను వ్యవసాయానికి సఃబంధించిన పుస్తకాలు, కొన్ని తమిళ మ్యాగజైన్స్ చదంవుతానన్నాడు. అలాగే పుస్తకాలపై మారియప్పన్ తో చర్చిస్తానని కూడా చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఆయనే ఫలానా పుస్తకం బాగుంటుందని సూచిస్తారన్నారు ధనపాల్. 

    - యామిజాల జగదీశ్

    Download Main Image

    Leave A Comment