గణేశ్ నిమజ్జనానికి వెళ్లొస్తుండగా ఘటన
హైదరాబాద్, బాలాపూర్, పీర్జాదిగూడ, లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు దుర్మరణం చెందారు. తెలంగాణకు చెందిన 9 మంది విద్యార్థులు వినాయక నిమజ్జనం పూర్తి చేసుకొని రెండు కార్లలో తిరిగొస్తుండగా మలుపు దగ్గర రహదారిని విభజించే మీడియన్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాదర్‌గుల్ ప్రాంతానికి చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య యాదవ్(23) ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. స్థానిక బీపీపీ యూనివర్సిటీలో చదువుతూ ఈస్ట్ లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. బోడుప్పల్‌కు చెందిన రవీందర్‌రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ(21) ఈస్ట్ లండన్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. బార్కింగ్ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వినాయక చవితి నేపథ్యంలో ఇల్‌ఫోర్డ్‌లో హైదరాబాద్ యువకులు కొందరు స్నేహితులతో కలిసి విగ్రహం ప్రతిష్ఠించారు. ఆదివారం సాయంత్రం నిమజ్జనోత్సవం నిర్వహించారు.
తొమ్మిది మంది రెండు కార్లలో 35 మైళ్ల దూరంలోని సౌత్‌ఎండ్ బీచ్‌కు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా మలుపు వద్ద రహదారిని విభజిస్తూ ఉన్న మీడియన్‌ను గమనించకుండా మొదటి కారు వేగంగా ఢీకొట్టింది. వెనకే వచ్చిన రెండో కారు వేగంగా మొదటి కారును ఢీకొట్టింది. ఈ ధాటికి చైతన్య యాదవ్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రిషితేజ, రావుల సాయిగౌతమ్, నూతన్, యువతేజారెడ్డి, వంశీ, వెంకట సుమంత్ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రిషితేజ మృతిచెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతుండగా సాయిగౌతమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. సోమవారం రాత్రి చైతన్య యాదవ్, రిషితేజ కుటుంబ సభ్యులకు స్నేహితులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో గోపీచంద్, మనోహర్ కారు నడిపినట్లు తెలుస్తోంది. ఎసెక్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని మంగళవారం వదిలేసినట్లు స్నేహితులు తెలిపారు. తమ పిల్లల మృతదేహాలు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు.
Leave A Comment