• Login / Register
  • Site Logo

    అదే జరిగితే పెట్రోల్, డీజిల్‌ రేట్లకు రెక్కలే!

    హోమ్

    ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్‌ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది.  బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.

    యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్‌ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్‌పై పడుతుంది.

    పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. 

    ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్‌, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి.


    Download Main Image

    Leave A Comment