• Login / Register
  • Site Logo

    అదే చివరి సెల్ఫీ!

    హోమ్
    అదే చివరి సెల్ఫీ!

    డాక్టర్‌ కుటుంబం కలను చిదిమేసిన విమాన ప్రమాదం


    రాజస్థాన్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఓ డాక్టర్‌ కుటుంబం మృతి చెందింది
    ఆయన కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడాలనుకున్నారు. ఎంతో ఆనందంగా తమ పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్ఞాపకాలను ఫోన్‌లో బంధించారు. విమానం గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకొని దాన్ని పదిలంగా దాచుకోవాలని భావించారు. అంతలోనే వారి కలలు కల్లలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై.. వారంతా మృత్యుఒడికి చేరారు. వారే రాజస్థాన్‌లోని బాంస్‌వాడకు చెందిన ఓ డాక్టర్‌ కుటుంబం. అహ్మదాబాద్‌లో గురువారం ఎయిరిండియా విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
    రాజస్థాన్‌కు చెందిన డాక్టర్‌ కోమి వ్యాస్‌, డాక్టర్‌ ప్రతీక్‌ జోషీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిరియా (8), ప్రద్యుత్‌, నకుల్‌ (5) అనే కవల పిల్లలు ఉన్నారు. కోమి, జోషీలు ఉదయ్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్‌కు వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్‌కు తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబమంతా కలిసి లండన్‌కు బయలుదేరింది. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్యా, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకొన్నారు. విమాన ప్రమాదం వారి కలల్ని చిదిమేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. 

    అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా  విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. గురువారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు.
    Download Main Image

    Leave A Comment